రేవంత్ రెడ్డిని హిట్లర్, తాలిబాన్లతో పోల్చిన కవిత

  • విద్యా వ్యవస్థను రేవంత్ రెడ్డి అస్తవ్యస్తం చేస్తున్నారన్న కవిత
  • ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోందని విమర్శ
  • రూ. 11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని మండిపాటు

తెలంగాణలో విద్యా వ్యవస్థ తీరుపై కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా తెలంగాణ రక్షణ సమితి కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆమె హిట్లర్, తాలిబాన్లతో పోల్చారు.


రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోందన్న ముఖ్యమంత్రి ప్రకటనపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం ద్వారా పేద విద్యార్థులను, ముఖ్యంగా బాలికలను చదువుకు దూరం చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాట కాదని, ఒక నియంత ఆలోచన విధానమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఒక సర్కస్ లాగా మార్చేశారని విమర్శించారు.


డిగ్రీ అడ్మిషన్లలో తీవ్ర గందరగోళం నెలకొందని, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, కమిషనరేట్ వేర్వేరు కోర్సులను సిఫార్సు చేస్తున్నాయని తెలిపారు. యూనివర్సిటీల అనుమతి లేని కోర్సుల్లో కూడా అడ్మిషన్లు సాగుతున్నాయని ఆరోపించారు. గురుకుల పాఠశాలల్లో దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు మరణించినా, ముఖ్యమంత్రి కనీసం ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించకపోవడం దారుణమన్నారు.


ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.7 వల్ల విద్యార్థులు నేరుగా ట్యూషన్ ఫీజులు చెల్లించాల్సి వస్తోందని.. మరోవైపు రూ. 11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని మండిపడ్డారు. ప్రైవేట్ కాలేజీల దోపిడీని అరికట్టేందుకు జీవో నెం.7ను వెంటనే రద్దు చేయాలని, ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ విద్యా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలంతా ముక్తకంఠంతో వ్యతిరేకించాలని ఆమె పిలుపునిచ్చారు.



K Kavitha
Revanth Reddy
Telangana Education System
Government Schools Closure
Fee Reimbursement
BRS Party

More Telugu News